దుబ్బాక ఉప ఎన్నికల బరిలో కమలదళం
ఇటీవల దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానానికి వచ్చే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది, ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల బరిలో నిలబడడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి.
తెలంగాణలో బలపడలన్న ఆసక్తితో ఉన్న బీజేపీ పార్టీకి ఇది ఒక అందివచ్చిన అవకాశంగా కనిపిస్తుంది.
ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నుంచి అభ్యర్థి ఎవరన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. ఇంతకు ముందు దుబ్బాక అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావుకే మళ్ళీ టికెట్ ఖాయం అని అందరు భావిస్తున్నారు.
రఘునందన్ రావు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు, తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా గొప్ప వక్త ఉన్నారు అంటే మొదట వినిపించే పేరు రఘునందన్ రావుదే, ఆయన వాక్ధాటికి ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే, రాజకీయలు, చట్టాలకు సంబంధించిన అంశాల పట్ల లోతైన విశ్లేషణ, సంపూర్ణ అవగహన కలిగిన నాయకుడు,
ఆయన వాక్పటిమకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని యువతలో ఫాలోయింగ్ ఉంది,
టీవీ చర్చల్లో ఆయన కూర్చుంటే తలపండిన రాజకీయ నాయకులు, విశ్లేషకులు సైతం ప్రేక్షకపాత్ర వహించాల్సిందే.
నిక్కచుగా మాట్లాడడం ఆయన నైజం, సామాన్య ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించడంలో కేసీఆర్ తర్వాతి స్థానం రఘునందన్ రావుదే.
నాడు తెలంగాణ ఉద్యమంలో ఆతర్వాత బీజేపీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు, తెలంగాణవాదులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు ఆయన అభిమానులు ఆయన్ని “ఫైర్ బ్రాండ్” అని పిలుచుకుంటారు.
పార్టీలో ఉన్న యువ నాయకులు తమకు ఏదైన విషయం మీద మాట్లాడాలి, అవగహన పరుచుకోవాలి అనుకుంటే రఘునందన్ డిబేట్స్ చూస్తామని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
పార్టీలో చేరినప్పటి నుంచి బిజెపి పటిష్టతకు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. తనదైన శైలిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రభుత్వానికి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తారు. రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా ఎన్నడూ అధైర్య పడలేదు.
అచెంచల ఆత్మవిశ్వాసంతో పట్టువదలని విక్రమార్కుడులా సై అంటే సై అంటూ కదనరంగంలో దూసుకెళ్తుంటారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 6 నెలల్లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం అంటే మామూలు విషయం కాదు. పార్టీ ఆదేశాల మేరకు 6 నెలల్లో రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి 2 లక్షల పైచిలుకు ఓట్లను సాధించి, బిజెపి ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచగలిగారు.
ప్రస్తుతం మళ్ళీ దుబ్బాక ఉపఎన్నికలు వస్తున్న తరుణంలో మరోసారి రఘునందన్ రావుకే అవకాశం కల్పించాలని, కేసీఆర్ కుంభస్థలమైన మెదక్ జిల్లాలో కాషాయ జెండా ఎగురవేసే సత్తా రఘునందన్ రావుకే ఉందని బిజెపి కార్యకర్తలు ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే సరైన నాయకులు ఒక్కరు కూడా లేనందున ఈసారి రఘునందన్ రావు గారిని అసెంబ్లీకి పంపిస్తే ప్రభుత్వాన్ని ఎదిరించే ఒక బలమైన నాయకుడు అసెంబ్లీలో ఉంటాడని అభిమానుల మరియు పార్టీ కార్యకర్తలు ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.